Pages

టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలపై ఆందోళన



ప్రస్తుతానికి స్వల్ప మార్పులే

-టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలపై ఆందోళన వద్దు
-సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతికి చోటు
-భవిష్యత్తులో ఏకీకృత తెలంగాణ సివిల్ సర్వీస్ రావాలి
-టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్



తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్న రాత పరీక్షలు, వాటికి సంబంధించిన సిలబస్‌లో స్వల్ప మార్పులను మాత్రమే సూచించామని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ఆయన నేతృత్వంలో వేసిన సిలబస్ సమీక్ష కమిటీ పరీక్షల విధానం, సిలబస్‌పై నెలపాటు చేసిన కసరత్తు ముగిసింది. అందుకు సంబంధించిన సిఫారసులతో కూడిన నివేదికను గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి సమర్పించారు. అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని సిలబస్, పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు మాత్రమే చేశామని తెలిపారు. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనందున పరీక్షా విధానం, సిలబస్‌ను వెంటనే సమూలంగా మార్చకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి అనుకూలంగా మార్పులు చేశామని పేర్కొన్నారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ సివిల్ సర్వీసుల విధానం రావాల్సిన అవసరం ఉందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. గ్రూప్ -1, గ్రూప్-2, ఇతర గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం భిన్నమైన రాత పరీక్షలు కాకుండా తెలంగాణ సివిల్ సర్వీస్ పేరుతో ఒకే రకమైన పరీక్ష నిర్వహించడం వల్ల నిరుద్యోగులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ర్టాల్లో గ్రూప్-1, గ్రూప్-2 వంటి కేడర్ పోస్టుల విధానం లేదని తెలిపారు. తమ సిఫారసుల నివేదికపై నిర్ణయాన్ని టీఎస్‌పీఎస్సీ తీసుకోదని, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు.

Tspsc Chairman Chakrapani



యంత్రాంగాన్ని విస్తరించాలి

సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ భర్తీ ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగార్థుల ప్రయోజనాల దృష్ట్యా నోటిఫికేషన్లు త్వరగా జారీ చేయాలని కోరారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సరిపడినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పభుత్వ సర్వీసులు, సామాజిక సేవలు వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పటిష్టమైన యంత్రాంగం కావాలన్నారు. అందుకోసం తెలంగాణలో యంత్రాంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారని, కానీ, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం యంత్రాంగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. సిలబస్ మార్పు, పరీక్షలకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. పరీక్షల విధానం, సిలబస్ మార్పుపై తమ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుచేసినందుకు టీఎస్‌పీఎస్సీ హరగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.

గ్రూప్ 2 బీ పోస్టుల విలీన అధికారం సర్కారుదే: కోదండరాం

గ్రూప్-1లో గ్రూప్-2 బీ కేడర్‌లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను కలిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 622లో మార్పులు, చేర్పుల అధికారం టీఎస్‌పీఎస్సీ, సిలబస్ కమిటీ పరిధిలో లేదని తెలిపారు. అయితే గ్రూప్-2 పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహించాలని సిఫారసు చేసినట్లు తెలిపారు.

వారం పదిరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: ఘంటా చక్రపాణి

హరగోపాల్ కమిటీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత వారం పదిరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మార్పులపై ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అనుమతిచ్చిన ఖాళీలతో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయడానికి సర్వీస్ కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. గుమాస్తా (క్లర్కు) ఉద్యోగ పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలు ఉండబోవని తెలిపారు. ఈ పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వనున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇలాంటి ఉహాజనిత వార్తలు రాయడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతారన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సర్వీస్ కమిషన్ ముందస్తుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని చక్రపాణి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నవారినే సిలబస్ సమీక్ష కమిటీలో సభ్యులుగా చేర్చామని, కొత్త రాష్ట్రంలో ఎలాంటి విధానాలు అవలంభించాలన్న అంశంపై కమిటీ సిఫారసులను పాటిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల, నిరుద్యోగుల ఆకాంక్షల గురించి తమకు తెలుసని, ఆ మేరకు రాత పరీక్షలు, సిలబస్‌లో మార్పులు జరుగుతున్నాయని చక్రపాణి వివరించారు.
Tspsc First Meet

Tspsc Full Details
Oldest